రవిశంకర్ అవధాని గారు వేద పండితులు
మహానంది ఆగస్టు 9(ప్రజాన్యూస్):హిందువులు అతి పవిత్రంగా చూసే మాసాలలో శ్రావణ మాసం ఒకటి..ఈ మాసం ముఖ్యంగా మహిళలు అతి పవిత్రంగా చూసే మాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు నోములు వ్రతాలతో కళకళలాడుతుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.శ్రావణమాసము సంవత్సరంలో ఐదవ నెల ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు ప్రారంభ మాసం కనుక విరివిగావర్షాలుపడతాయి.పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసంఅని పేరు వచ్చింది. సృష్టి స్థితి లయ కారకులైనన త్రిమూర్తుల సతులైన ముగ్గురమ్మల అనుగ్రహాన్నిఇచ్చేగొప్పమాసంఇది.శ్రీమహావిష్ణువుకి ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ శుక్రవారములు పరమేశ్వరుడి సతియైన గౌరి దేవికి శ్రావణ మంగళవారములు, బ్రహ్మకు సతియైన సరస్వతికి శ్రావణ పౌర్ణమి రోజుల్లో వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం ఇది.శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం ఎంతోఅనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.
శ్రావణ శుద్ధ చతుర్థి (నాగుల చవితి)
శ్రావణ శుద్ధ పంచమి (గరుడ పంచమి)
శ్రావణ శుద్ధ ఏకాదశి (పుత్రదా సర్వేషాం) ఏకాదశి
శ్రావణ రెండవశుక్రవారం వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుద్ధ ద్వాదశి దామోదర ద్వాదశి.
శ్రావణ పూర్ణిమ రాఖీ ( జంధ్యాల పూర్ణిమ)
శ్రావణ బహుళ అష్ఠమి కృష్ణాష్టమి
శ్రావణ బహుళ నవమి మరియు స్వాతంత్ర్య దినోత్సవం
శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య ఇలా ఇన్ని పండుగలు పర్వదినాలు ఉన్న పవిత్రమాసం
శ్రావణమాసం.వీటితో పాటు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా మంచి శుభముహూర్తాల అద్భుతమాసం ఈ శ్రావణ మాసం.ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు ‘శ్రవణ’మనే పదంలో పుట్టిన ఈ మాస నామమునకు వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా “వినుట”అని అర్థం. వేదవిద్య గ్రంధములు చూచి చదివి పఠనం చేసేది కాదు. గురుముఖతః విని నేర్వదగినది. ఇలా అధ్యయనం చేసే వేదమునకే ‘స్వాధ్యాయ’మనేది మరో నామం. ఇది మహావిద్య సామాన్యంగా వచ్చేది కాదు.
వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినది. స్త్రీలకూ వేదపఠనంలేనందున తత్సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, కష్టాలను తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసంలో నూతన వధువులు శ్రావణమంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు.పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు.
“గృహిణీగృహముచ్యతే”అని శాస్త్రమే చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని మిగిలినవారందరికి ఆనందం కలుగుతుంది.
ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరుతుంది.