న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని బీసీసీఐ భావించింది. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్ నుంచే మొత్తం 10 జట్లతో లీగ్‌ను ఆడించాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు టెండర్లను కూడా పిలవాలనుకుంది. కానీ కరోనా ప్రభావం దీనిపైనా పడింది. ఇప్పటికే సగం మ్యాచ్‌ల తర్వాత అర్ధంతరంగా లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో రెండు జట్ల కోసం టెండర్లను కూడా ఇప్పట్లో ఆహ్వానించకూడదని బోర్డు ఆలోచిస్తోంది. ప్రస్తుతం దృష్టంతా మిగిలిన సీజన్‌ను ఎలా నిర్వహించాలనే దానిపైనే ఉన్నట్టు సమాచారం. ‘కొత్త జట్ల చేరికపై ప్రస్తుతం బీసీసీఐ ఎలాంటి ఆలోచన చేయడం లేదు. జూలై వరకైతే ఈ విషయంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు.
తాజా సీజన్‌ను ఎలా.. ఎప్పుడు పూర్తి చేయాలనే విషయంపై బోర్డు ఆలోచనలున్నాయి. ఈ విషయం ఓ కొలిక్కి వచ్చాకే ఆ రెండు టీమ్స్‌పై తేలుస్తారు’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌ను ఎనిమిది జట్లతో కాకుండా 2022 నుంచి 10 జట్లతో నిర్వహిస్తామని ఈ ఏడాది ఆరంభంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే 14వ సీజన్ ముగిశాక వీటి కోసం టెండర్లు పిలవాలని భావించారు. అయితే కొవిడ్ ధాటికి అంతా తారుమారైంది. మరోవైపు తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన మెగా ఆటగాళ్ల వేలం కూడా ఉండకపోవచ్చని, ఈ ఏడాది జరిగిన మినీ వేలం లాంటిదే నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు.