ఖమ్మం: ఓవైపు కొవిడ్ భయంతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరోనా చికిత్సలో ఎంతో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల పేరిట సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరుగుతున్న ఈ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడేనికి చెందిన ఆటోడ్రైవర్ ఎం.భద్రయ్యకు కరోనా సోకడంతో గతనెల 24న ఖమ్మంలోని బాలాజీ చెస్ట్ ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల అనంతరం భద్రయ్యకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వేయాల్సి ఉందని, వాటిని తెచ్చుకోవాలని డాక్టర్ శ్యామ్‌కుమార్ సూచించారు. దీంతో భద్రయ్య బంధువులు అదే ఆస్పత్రికి మందులు సరఫరా చేసే మెడికల్ రిప్రజంటేటివ్ రాంబాబును సంప్రదించారు. రెండు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను రూ.60 వేలకు అతను ఇచ్చాడు. డాక్టర్ శ్యామ్‌కుమార్ ఆ ఇంజక్షన్లను గత నెల 28న భద్రయ్యకు ఇచ్చారు.
ఆ తర్వాత రోజు భద్రయ్య పరిస్థితి విషమించడం, శ్వాస సమస్య ఉన్నట్లు తేలడంతో తమ దగ్గర వెంటిలేటర్ సౌకర్యం లేదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ భద్రయ్యను డిశ్చార్జి చేశారు. అనుమానం వచ్చిన భద్రయ్య బంధువులు.. తమకు ఇచ్చిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ సీసాలను భద్రపరిచారు. ఆ తర్వాత పరిస్థితి విషమించి భద్రయ్య చనిపోయాడు. ఆ ఇంజక్షన్లు నకిలీవని, వాటి కారణంగానే తన తండ్రి చనిపోయాడని మృతుడి కుమారుడు సందీప్.. కలెక్టర్ ఆర్వీకర్ణన్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు.
కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన హైపవర్ కమిటీ బృందం ఆస్పత్రికి వెళ్లింది. భద్రయ్యకు ఇచ్చింది నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లేనని నిర్ధారించింది. సందీప్ ఫిర్యాదు మేరకు ఆస్పత్రి వైద్యుడు శ్యామ్‌కుమార్, మెడికల్ రిప్రజంటేటివ్ రాంబాబు, ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి నవీన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురిని బుధవారం అరెస్టు చేశారు. మరోవైపు.. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ. 25 వేల నుంచి 30 వేలకు ఒకటి చొప్పున విక్రయిస్తున్న ముఠాను కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఎనుగుర్తి మమత, నక్క శ్రీకాంత్, పర్వతం సాయికృష్ణ, నారెడ్ల మధుకర్, కనపర్తి వంశీధర్ కలిసి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. తాము రోగుల బంధువులమంటూ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.