ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
సాధారణంగా పెళ్లి వేడుకల్లో బహుమతలు ఇచ్చిపుచ్చుకోవడమనేది సహజం. అయితే మహానంది లో విచిత్రమైన కానుకల తో ఒక వివాహం జరిగింది. స్థానికంగా ఇది చర్చకు దారితీయడంతో పాటు పదిమందికీ ఆదర్శంగా నిలిచింది.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా మధురమైన ఘట్టం. ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత కోరుకుంటారు. ఇక పెళ్లి పత్రిక మొదలు, మండపం, భోజనాల వరకు ప్రతిదీ వెరైటీగా ఉండాలని భావిస్తుంటారు. అలానే యువత తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల వివాహలు ఘనంగా జరిపించాలని కోరుకుంటారు. అయితే కొన్ని కుటుంబాలు, యువత మాత్రం తమ పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావిస్తుంటారు. ఈక్రమంలోనే పెళ్లి సమయంలోనే పలు సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ఓ నూతన వధూవరులు పెళ్లిలో రక్తదాన శిబిరం నిర్వహించి..అందరికి స్పూర్తిగా నిలిచారు. ఈ ఘటన మహానంది లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తెలుగు వెంకటహరీశ్ ..తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇక హరీశ్ సేవా కార్యక్రమాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుండే వాడు. అలానే తన పెళ్లికి కూడా అందరిలాగా కాకుండా వెరైటీగా ఉండాలని భావించాడు. తన పెళ్లి వేడుక కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించాడు. ఇలాంటి తరుణంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన అనూష అనే యువతితో వీరిద్దరికి మహానంది లోని ఓ కళ్యాణ మంటపం లో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో బంధువులు పెళ్లికి హాజరై.. సందడి చేశారు. ఇక పెళ్లి రోజు తాను అనుకున్నసేవ కార్యక్రమం చేయాలని హరీశ్ అనుకున్నాడు. పెళ్లి మండపంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన వారితో కలిపి 20 మంది రక్తదానం చేశారు.
నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి పెళ్లి వారింట రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని కొందరు అంటున్నారు. తాను రక్తదానం చేయడం 28 వ సారి అని వరుడు హరీశ్ తెలిపాడు. రక్త దాన శిబిరం ఏర్పాటు చేసిన ఈ నూతన వధువరులను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. మరి.. తమ పెళ్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులపై స్థానికులు ప్రశంసించారు.