ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల భద్రతా రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమయ్యే భవనాలను జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పరిశీలించారు. పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జియం ఇంజనీరింగ్ కాలేజీ, శాంతిరాం ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ, పట్టణంలోని CWC గోడౌన్ లోని భవనాలను జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పోలింగ్ పిదప ఈవీఎంల భద్రతా భవనాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమయ్యే భవనాలను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి అసెంబ్లీకి రెండు భవనాలు, పార్లమెంట్ కు రెండు భవనాలు చొప్పున నాలుగు భవనాలు, ఆరు నియోజకవర్గాలకు 24 భవనాలు అవసరం అవుతాయని గుర్తించారు. వీటితో పాటు అన్ని నియోజకవర్గాల పోలింగ్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి అవసరమయ్యే భవనాలను కూడా పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
అంతకుముందు నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో వున్న CWC గోడౌన్ లోని భవనాలను కూడ ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూముల కొరకు కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. సబ్ డివిజన్ డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి, RDO మల్లికార్జున రెడ్డి, డి.ఎస్.ఓ వెంకట్రాముడు, నంద్యాల తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పాణ్యం తాసిల్దార్ ఫణి కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.