కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ పై పరిశీలన – సూచనలు

మూగి వెంకట రమణారెడ్డి సీనియర్ జర్నలిస్టు

నంద్యాల జూలై22(ప్రజాన్యూస్):Iఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం, విభజన జరిగిన 60 రోజుల లోపుగా కృష్ణా నది యాజమాన్య మరియు గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిని నిర్ణయించి అమలు పరచాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన చట్టబద్ద నీటిని ఎలాంటి వివాదాలు లేకుండా పొందడానికి కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని నిర్ణయించాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాలలో కోరాయి. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధులను నిర్ణయిస్తూ జులై 15, 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచినట్లుగా కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధులను నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నోటిఫికేషన్ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆహ్వానిస్తున్నది. కాని ఈ నోటిఫికేషన్ లో పొందుపర్చిన కొన్ని అంశాలు చట్టబద్దంగా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 లో పేర్కొన్న అంశాల ప్రాతిపదికన లేవు‌. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రాతిపదికన క్రింద పేర్కొన్న అంశాలను నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో చేర్చి, సవరణలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఉత్తరం రాసింది.

1. నిర్మాణం లో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను నిర్దేశించిన పథకం ప్రకారం పూర్తి చేసి నీటిని వినియోగించుకొనాలని రాష్ట్ర విభజన చట్టంలోని పదకొండవ షెడ్యూల్ పదవ పాయింట్ లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టులను అనుమతి పొందిన ప్రాజెక్టులుగా నోటిఫికేషన్ లో పేర్కొనాలి. ఈ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం క్రియాశీలక కార్యాచరణ బాధ్యత తీసుకోవాలి.

2. రాష్ట్ర విభజన చట్టం పదకొండవ షెడ్యూల్ మూడవ పాయింట్ లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులకు లేదా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలకు కేటాయించిన నీటిలో మార్పు ఉండదని పేర్కొన్నారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 512 టి.ఎం.సీ. ల నీటి హక్కును నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొనాలి.

3. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 (4) (b) ప్రకారం ఒక్కొక్క రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులు నది యాజమాన్య బోర్డులో ఉండాలి. దీని ప్రకారం ఇరు తెలుగు రాష్ట్రాల నుండి నలుగురు సభ్యులు ఉండేలాగా నోటిఫికేషన్ లో పేర్కొనాలి.

4. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నది నీటి నిర్వహణకు కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలులో కృష్ణా నది యాజమాన్య బోర్డు ను ఏర్పాటు చేయాలి.

5. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 (8) a (ii) ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చట్టబద్ద నీటిని వినియోగించుకునడానికి అంతర్గత సర్దుబాట్లతో చేసుకున్న ఏర్పాట్లకు అనుమతించారు. దీని ప్రకారం ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల, సిద్దాపురం ఎత్తిపోతలను అనుమతించిన ప్రాజెక్టులగా నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.

6. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 (8) (d) ప్రకారం చట్టబద్ద నీటి హక్కులు గల ప్రాజెక్టుల నీటి లభ్యతకు విఘాతం కలగని ప్రాజెక్టులు నిర్మాణం అనుమతులతో చేపట్టవచ్చు. దీని ప్రకారం రాష్ట్ర విభజన కు ముందే డి పి ఆర్ కు అనుమతులు పొందిన గుండ్రేవుల రిజర్వాయర్ ను అనుమతులు పొందాల్సిన ప్రాజెక్టుగా చేరుస్తూ నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.

వరద లేదా కరువు సంవత్సరాలలో శ్రీశైలం రిజర్వాయర్ నుండి అన్ని ప్రాంతాల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చడానికి, ఏ ప్రాంత చట్టబద్ద హక్కులకు విఘాతం కలుగకుండా ఉండటానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ను అనుమతులు పొందాల్సిన ప్రాజెక్టుగా నోటిఫికేషన్ లో పొందుపర్చాలి.

7. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90 (3) ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆదా అయ్యే 45 టి.ఎం.సి. లో నీటిని రాష్ట్ర విభజన చట్టం లో పొందుపర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కేటాయిస్తూ నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.

8. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 91 (2) ప్రకారం తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు తుంగభద్ర బోర్డు పరిధిలో ఉంటాయి. నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో వీటిని కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలో చేర్చారు. ఈ ప్రాజెక్టులను తుంగభద్ర నది యాజమాన్య బోర్డు పరిధిలో నైనా కొనసాగిస్తూ లేదా కర్నాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులను కూడా నది యాజమాన్య బోర్డు పరిదిలోనికి తీసుకొని వస్తూ నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.

9. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 (7) పదకొండవ షెడ్యూల్ (2) మరియు (3) ప్రకారం తాగు నీటికి ప్రథమ, సాగునీటికి ద్వితీయ, విద్యుత్ ఉత్పత్తికి చివరి ప్రాధాన్యత ను ఇవ్వాలి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి మార్చి 26, 2014 న ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన అనుమతులలో శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులుగా పేర్కొన్నది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తాగు, సాగునీటి ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతం కూడా పొందడానికి శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులు నిర్వహించేలాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు విధానాలు రూపొందించాలి.

10. కృష్ణానది నీటిపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టుల హెడ్ రీచ్ లను మాత్రమే కృష్ణా నది యాజమాన్య బోర్డు లో పేర్కొంటూ నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *