విజయవాడ జూన్ 4(ప్రజాన్యూస్): విజయవాడలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగానిర్వహించారు..కుమారుడు రాధాకృష్ణ రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనసేన నాయకుడు పోతిన మహేష్ కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తండ్రి రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు. కరోనా సమయంలోనూ రంగాపై అభిమానంతో తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రంగా పేద ప్రజల ఆశాజ్యోతి అని, ఆయన జీవితం అంతా పేదల కోసం అంకితం చేశారన్నారు. అందుకే కులమతాలకు అతీతంగా అందరి మనసుల్లో రంగా నిలిచిపోయారని కొనియాడారు. జిల్లాల పునర్విభజన జరిగితే రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలోనే వంగవీటి రంగా పేరు పెట్టాలని సిఎం జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.