అమరావతి జూలై3(ప్రజాన్యూస్):ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 4 తేదీతో ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన పాలకమండలి ఏర్పాటైతే ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు ముగిసినా..లెక్కింపుపై హైకోర్టులో విచారణ ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. . జూలై 5 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని వివరించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక, జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది.. కొంత కాలం ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య వివాదం నడవగా.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించినా.. కౌంటింగ్‌పై కోర్టులో విచారణ సాగుతోన్న సంగతి తెలిసిందే.