దేశ ప్రధాని నరేంద్ర మోడీ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు చేసిన ప్రకటన పట్ల అఖిలభారత బీమా ఉద్యోగుల సంఘం, బ్రాంచ్ యూనిట్ అధ్యక్షుడుR.S.L రంగారావు., కార్యదర్శిఏ.రమేశ్ బాబు.హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త పిలుపు మేరకు స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రదర్శనను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. ఈ చట్టాల వల్ల భారతీయ రైతాంగం బడా కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకొవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎలాంటి చర్చ లేకుండా భారత పార్లమెంట్ ఈ చట్టాలను ఆమోదించడం పట్ల రైతుల లో తీవ్ర ఆందోళన వ్యక్తమైందని వారు అన్నారు. ఈ ఏడాది కాలంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయని, ఈ పోరాట కాలంలో వందలాది మంది రైతు ఉద్యమకారులు మరణించారని అన్నారు. దేశంలో 50 శాతం పైబడి కార్మిక వర్గం వ్యవసాయరంగంపై ఆధారపడిన నేపథ్యంలో, రైతాంగం పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లభించకుండా అటు రైతు బాగుపడదని, ఇటు దేశం ప్రగతి సాధించదని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల పోరాటం లేవనెత్తిన అనేక అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు. తమ ధర్మ పోరాటంలో విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చాకు, రైతులకు, మద్దతిచ్చిన ప్రజానీకానికి వారు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.