ఇన్ఫెక్షన్ కొద్దిగా మిగిలినా సవాలు తొలగనట్టే: మోదీ

న్యూఢిల్లీ: యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఇన్‌ఫెక్షన్ అనేది ఏ కొద్దిగా మిగిలినా మన ముందున్న సవాలు పూర్తిగా తొలగనట్టేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో కోవిడ్ మేనేజిమెంట్‌పై క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని మోదీ రెండో విడత గురువారంనాడు సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని ఏర్పాటు చేసిన గత సమావేశాలకు దూరంగా ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి వర్చువల్ మీట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కరోనా కారణంగా అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయని, ఈ సరికొత్త సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని దిశానిర్దేశం చేశారు. స్థానిక అనుభవాలను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ ఒక దేశంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

కోవిడ్ మేనేజిమెంట్‌పై జిల్లాల అధికారులతో మోదీ తొలి రౌండ్ సమావేశం గత మంగళవారంనాడు జరిగింది. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడున్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పీఎం ఈ సందర్భంగా సూచించారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ఆయా జిల్లాల యంత్రాంగం ఫీల్డ్ కమాండర్లుగా వ్యవహరించడం ప్రశంసనీయమని అన్నారు. ప్రతి జిల్లాకు వేర్వేరు సవాళ్లుంటాయని, జిల్లాల్లో ఎదురవుతున్న సవాళ్లు అధికార యంత్రాంగానికే బాగా తెలుస్తాయని అన్నారు. ”మీ జిల్లా గెలిస్తే అది దేశ విజయం. కోవిడ్‌ను ఓడించడంలో మీ జిల్లా ఓడిపోతే, అది దేశ ఓటమి” అని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *