కోలుకున్న 3 నెలలకు టీకా!

న్యూఢిల్లీ, మే 19: కొవిడ్‌ బారినపడ్డ వారు కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు కనీసం మూడు నెలలు ఆగాలని కేంద్రం సూచించింది. అలాగే, తొలిడోసు తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడ్డ వాళ్లు కూడా రెండో డోసు కోసం.. కోలుకున్న తర్వాత నుంచి మూడు నెలల పాటు వేచి ఉండాలని తెలిపింది. గతంలో ఈ సమయం నాలుగు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. వీటన్నింటినీ సవరిస్తూ.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వ్యాక్సినేషన్‌ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని పేర్కొంది. అలాగే, కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని, అందులో నెగెటివ్‌ వచ్చిన తర్వాత 14 రోజులకు రక్తం దానం చేయొచ్చని చెప్పింది. బాలింతలు కూడా నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని తెలిపింది.

గర్భిణులకు వ్యాక్సినేషన్‌ విషయంలో అధ్యయనం జరుగుతోందని, ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి.. నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌-19 (ఎన్‌ఈజీవీఏసీ) చేసిన తాజా ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. ప్లాస్మా చికిత్స తీసుకున్న వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత వ్యాక్సిన్‌ తీసుకోవాలని, ఇతర వ్యాధులకు ఐసీయూలో చికిత్స తీసుకున్న వారు డిశ్చార్జి అయిన 4-8 వారాల తర్వాతే టీకా వేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలూ అవసరం లేదని తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాల్లో తీసుకొచ్చిన ఈ తాజా మార్పులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ  పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *