టీ20 ప్రపంచకప్‌పై ఏం చేద్దాం?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. త్వరలో మూడో వేవ్‌ కూడా రాబోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో భారత్‌లో జరగాల్సిన ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై అందరికీ సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 29న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరుగనుంది. దీంట్లో ప్రధానంగా ఈ మెగా ఈవెంట్‌పైనే కాకుండా పలు అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. ‘జూన్‌ 1న ఐసీసీ సమావేశం ఉంది. అయితే అంతకన్నా ముందే ఎస్‌జీఎంను సమావేశపరిచి దేశంలో కొవిడ్‌ పరిస్థితులతో పాటు అక్టోబరు-నవంబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చిస్తారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటు మహిళల క్రికెట్‌పై కూడా చర్చ జరుగుతుంది’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. మరోవైపు టోర్నీ కోసం ఇదివరకే దేశంలోని తొమ్మిది నగరాలను ఎంపిక చేసి, ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా సూచించారు.

 

రేసులో యూఏఈ

ఒకవేళ భారత్‌లో టీ20 ప్రపంచక్‌పను నిర్వహించలేని పరిస్థితుల్లో యూఏఈని ప్రత్యామ్నాయ వేదికగా భావిస్తున్నారు. ‘ప్రస్తుతానికైతే భారతే ఆతిథ్య దేశం. పరిస్థితులు తీవ్రరూపం దాల్చితే జూన్‌ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అప్పుడు రెండో ఆప్షన్‌గా యూఏఈ ఉంటుంది’ అని బోర్డు ఉన్నతాధికారి తెలిపాడు.

 

ఇంగ్లండ్‌లో ఐపీఎల్‌?

ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల రీషెడ్యూల్‌పై కూడా చర్చ సాగనుంది. అటు ఇంగ్లండ్‌, యూఏ ఈ, శ్రీలంక కూడా నిర్వహణ కోసం ముందుకు వచ్చాయి. అయితే వీటిలో ఇంగ్లండ్‌ వైపు బీసీసీఐ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా గే అది ఖర్చుతో కూడుకున్న వేదిక అవుతుందేమోనని భావిస్తున్నారు. కానీ స్టేడియాల్లోకి ప్రేక్షకుల అనుమతి ఉంటుంది కాబట్టి ఫ్రాంచైజీలకు గేట్‌ మనీకి ఢోకా ఉండదు. ఈ రూపేణా వారి ఖర్చులను కాస్త తగ్గించవచ్చు. అలాగే యూఏఈని కూడా మరో ఆప్షన్‌గా పెట్టుకున్నారు. కానీ శ్రీలంకను మాత్రం బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *