గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించండి..జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానిసామూన్

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్

జిల్లాలో ఈనెల 26వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ వేడుకలకోసం కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్, వేదిక, బ్యాక్ డ్రాప్, విఐపి సీటింగ్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ చూపాలని ఆర్డీఓ, పోలీసు అధికారులను ఆదేశించారు. దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు.

నవరత్నాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింభించేలా వ్యవసాయం, డిఆర్డిఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా, వ్యవసాయ అనుబంధ రంగాలు, సంక్షేమం తదితర అన్ని సంక్షేమ శాఖలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జనవరి 26వ తేదీ నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రజలు, పాఠశాల విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతంలో స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తలెత్తిన సూక్ష్మలోపాలను సైతం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వేడుకల నిర్వహణపై సీరియస్ గా తీసుకోవాలని జిల్లాధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులకు అప్పగించిన విధులను  ముందస్తుగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహ్వాన పత్రికలను ప్రోటోకాల్ ప్రకారం ముందుగానే పంపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు.ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీవో శ్రీనివాసులు, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి, డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డీఈవో సుధాకర్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శివారెడ్డి,ఇతర జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *