కోహ్లీ సేనకు గుడ్ న్యూస్. టీమిండియాకు బ్రిటీష్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. టీమిండియా సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ మంత్రాంగం ఫలించింది. భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా మూడు నెలల పాటు అక్కడే ఉండాలి. ఈ సమయంలో న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌తోపాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌లు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ప్రభుత్వంతో బీసీసీఐ సంప్రదింపులు జరిపి నిబంధనలకు సడలింపులు సాధించింది. టీమిండియా సభ్యులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం నాటికి ముంబై చేరుకుని మే 24 నుంచి బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారు. జూన్ 2న ప్రత్యేక విమానంలో బ్రిటన్‌కు బయలుదేరతారు. అక్కడికి చేరుకున్నాక క్వారంటైన్లో ఉండి జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడతారు. నెల రోజుల విరామం అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ప్రారంభిస్తారు.