హైదరాబాద్: కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేట్ హాస్పిటళ్లు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్న.. పట్టించుకునే వారే లేరన్నారు. టాస్క్ ఫోర్స్ వేశారు అది ఉత్తదేనేని చెప్పారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఈ రాష్ట్ర కేడర్ కాదని సీరియస్‌గా పనిచేయడం లేదని మండిపడ్డారు. ఓ సమావేశంలో బిస్కెట్స్ తినుకుంటూ.. కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫార్మా కంపెనీలతో సీఎస్, టాస్క్ ఫోర్స్ చైర్మన్, మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారో ప్రజలకు తెలియాలన్నారు. పాతాళ భైరవి సినిమాలోలా సీఎం కేసీఆర్ అలా వచ్చి ఇలా మీటింగ్ పెట్టి వెళ్లిపోతారని భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు.
ప్రజలకు దైర్యం నింపేలా సీఎం కేసీఆర్ పనిచేయాలన్నారు. కేటీఆర్‌కు టాస్క్‌ఫోర్స్ చైర్మన్ పదవి రాగానే.. వ్యాక్సిన్ బంద్ అయ్యిందని దెప్పిపొడిశారు. కేసీఆర్, కేటీఆర్ వల్ల కాకపోతే ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. మండలాల్లో, గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్స్ పెడితే.. హైదరాబాద్‌పై ఫోర్స్ తగ్గుతుందని చెప్పారు. గవర్నర్ కూడా చొరవ తీసుకోవాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.