నెలాఖరుదాకా కర్ఫ్యూ

అమరావతి, మే 17: కొవిడ్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈ నెలాఖరుదాకా కర్ఫ్యూను పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కర్ఫ్యూ వల్ల ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలైనా అమలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘కర్ఫ్యూ విధించి ఇప్పటికి కేవలం పదిరోజులే అయింది. నెలాఖరుదాకా దానిని పొడిగించండి. కర్ఫ్యూ సమయం, నియమ నిబంధనలు, మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగించండి’’ అని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా బయటపడిన బ్లాక్‌ ఫంగస్‌ వైరస్‌ బారినపడినవారికీ ఆరోగ్యశ్రీలోనే వైద్యసేవలు అందించాలని స్పష్టంచేశారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకొనేలా కార్యాచరణను సిద్ధం చేయాలని కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కరోనా కట్టడిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడినవారిని సంపూర్ణంగా గుర్తించేందుకు చేపడుతున్న ఫీవర్‌ సర్వేలో జ్వరం ఉందని గుర్తించినవారికి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. డయాబెటిక్‌ బాధితులకు, విపరీతంగా స్టెరాయిడ్స్‌ తీసుకున్నవారికి బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని ..రాష్ట్రంలో ఇప్పటివరకూ తొమ్మిది ఫంగస్‌ కేసులు గుర్తించామని అధికారులు వివరించారు.

ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జగన్‌ ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని కోరారు.  గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 625 కొవిడ్‌ కేర్‌ ఆస్పత్రుల్లో 47,825  బెడ్లు ఉన్నాయని, వాటిలో 38,492 బెడ్లు రోగులతో నిండాయన్నారు. వారిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని సమీక్షలో అధికారులు వెల్లడించారు.  కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు, 23,463 ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు,  17,246 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు,  3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. 115 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోని 52,471 బెడ్లలో 17,417 బెడ్లు నిండాయన్నారు. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మినహాయింపు 

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, నియంత్రణ కోసం ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగిస్తోందంటూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి సిబ్బందితో పాటు అసెంబ్లీ అధికారులు, అసెంబ్లీ సిబ్బందికి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరంతా కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ అసెంబ్లీకి హాజరుకావాలని సూచించింది. కాగా,  కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను  కోల్పోయిన  పిల్లల  పేరుమీద రూ. 10లక్షలు డిపాజిట్‌ చేయాలని సీఎం ఆదేశించారని సింఘాల్‌ తెలిపారు. దానిపై వచ్చే వడ్డీతో ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా కార్యాచరణను రూపొందించాలని కోరారన్నారు. ఫీవర్‌ సర్వే ద్వారా మూడు రోజుల్లో 91,000 మంది జ్వరపీడితులను గుర్తించామన్నారు. జ్వరం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడంతోపాటు హోం ఐసొలేషన్‌ కిట్లు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది నియమించుకున్న విధంగానే ఈ ఏడాది కూడా కొత్తగా వైద్య సిబ్బందిని నియమించుకుంటున్నామని తెలిపారు. 

రోజుకు 80 టన్నుల ఆక్సిజన్‌ కావాలి

రాష్ట్రానికి కేంద్రం ప్రస్తుతం 590 టన్నుల ఆక్సిజన్‌ కేటాయింపులు చేయగా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలుపుకొని 590 నుంచి 610 టన్నుల వరకూ డిమాండ్‌ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ జామ్‌నగర్‌ నుంచి 80 టన్నుల ఆక్సిజన్‌ను పంపాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పుడు అత్యవసరమైన వాటిలో 7,32,542 ఎన్‌-95 మాస్కులు, 7,55,395 పీపీఈ కిట్లు, 44,11,353 సర్జికల్‌ మాస్కులతోపాటు 23,383 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు నిల్వ ఉండగా .. ఇంకా 8 లక్షలు మైలాన్‌ నుంచి, మరో 50,000 రెడ్డీ్‌సల్యాబ్‌ నుంచి సేకరించేందుకు ఆర్డర్‌ పెట్టామని వివరించారు. కేంద్రం నుంచి 75,99,960 వ్యాక్సిన్‌ డోస్‌లు రాగా వాటిలో కొవిషీల్డ్‌  62,60,400 వాక్సిన్లు కాగా .. కొవాగ్జిన్‌  వ్యాక్సిన్లు 13,39,560 ఉన్నాయన్నారు. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు 2,27,490 కేటాయించగా.. కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *