హాస్యనటి, సహాయనటి పాత్రల్లో తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య పరిస్థితులతో నటనకు దూరమైన ఆమె ఎస్.ఆర్.నగర్ బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సినీ పరిశ్రమ, దాతల నుంచి సాయం కోరుతున్నారు. ఆమె కష్టాలు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆదివారం పావలా శ్యామల ఇంటికి వెళ్లి రూ.10వేలు సాయం చేశారు. ఈ సందర్భంగా పావలా శ్యామల ‘చిత్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘చాలాకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మూడు నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. ఇటీవల ఓ ఐదు రోజులు పస్తులున్నాం. ఆకలితో, నా బిడ్డను మంచం మీద వదిలేసి నా ప్రాణం పోతాదేమో’ అని భయపడుతున్నా. కెరీర్ ప్రారంభం నుంచి ఆకలి బాధలు అలవాటే అయినా, ఇప్పుడు మాత్రం చాలా భయం అనిపిస్తోంది.
చుట్టు పక్కల వారు, అభిమానులు తలాకొంత సాయం చేయడంతో పూట గడుస్తోంది. నాకూ, కూతురికి కలిపి మందుల కోసం నెలకు రూ.10 వేలు ఖర్చు అవుతోంది. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దిక్కు తోచడం లేదు. అవార్డులు అమ్మి ఇల్లు గడుపుతున్నా. ప్రతి నెలా వచ్చే ఫించన్ కూడా రావడం లేదు. కరోనా వల్ల ఎవరూ ఏ సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. టీబీ వ్యాధి బారిన పడి కోలుకుంటున్న సమయంలోనే ఓ కాలికి గాయం కావడంతో నా కూతురు 18 నెలలుగా మంచానికే పరిమితమయింది. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా నా కూతురు బాగోగులు చూసుకుంటున్నా.