ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్
విజయవాడ అక్టోబర్ 14(ప్రజాన్యూస్):ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు విజయదశమి సందర్భంగా శుక్రవారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. విజయదశమికి ఎంతో విశిష్టత ఉంది. విజయదశమినాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. చివరి రోజు కావడంతో భక్తులు ఇందకీలాద్రికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కిక్కిరిపోయాయి. భవానీలు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు.
ఉత్సవాలు చివరి రోజు కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూ లైన్ మార్గంలో ఉన్నా దర్శనం కావడంలేదంటూ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ మార్గంలో చంటి పిల్లలకు పాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలకు, పోలీసుల కుటుంబాలకు మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. రాజగోపురం వద్ద అరగంట నుంచి ట్రాఫిక్ జాం అయింది. భక్తులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.