ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
*శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కలెక్టర్- డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి 1 నుండి 11 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేలికగా మల్లన్న దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు బాధ్యతాయుతంగా అధికారులకు అప్పగించిన పనులను నిర్వహించాలని, ప్రధానంగా క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయం, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రద్ధీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలతో పాటు వైద్యనిపుణులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. అలాగే దోమలను అరికట్టేందుకు ఫాగింగ్ మెటిరీయల్ సిద్ధంగా ఉండాలని మలేరియా అధికారిని ఆదేశించారు. శ్రీశైలంలోని పిహెచ్‌సి, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలని డి.ఎం. అండ్ హెచ్.ఓను ఆదేశించారు. ముఖ్య ప్రదేశాలలో రెండు షిఫ్టులలో వైద్యులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్రమార్గములో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 31 ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్నామని, ఇందుకు ప్రతిపాదించిన గజ ఈతనిపుణులు, అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధకారులను, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు.శివదీక్షా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, కార్యనిర్వహణాధికారివారికి సూచించారు.
అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో టోల్‌గేట్, వలయ రహదారి ( రింగురోడ్డు) యజ్ఞవాటిక పార్కింగు ప్రదేశం, మల్లమ్మ కన్నీరు ప్రాంతం. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రక్కన గల పార్కింగు ప్రదేశం, ఆర్టీసీ బస్టాండు ప్రాంతం మొదలైన ప్రదేశాలను పరిశీలించారు. అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా అవసరమైన సదుపాయాలు ఉండాలన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డి.ఆర్.ఓ పద్మజ, ఆత్మకూరు ఆర్‌డిఓ మిరియాల దాసు, అన్నిశాఖల జిల్లా అధికారులు, మార్కాపురం, దోర్నాల, తెలంగాణా, కర్ణాటక ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.