రిపోర్టర్..రఘనాదరెడ్డి
బనగానపల్లె ,జనవరి 07 (ప్రజాన్యూస్)

నందవరం: ఉదయం ఖచ్చితంగా 8 గంటల 05 నిమిషాలకు నందవరం జెడ్పీ హైస్కూల్‌కు విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ జనార్దన్ రెడ్డి పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌ను సందర్శించి బోధన–అభ్యాస విధానాలను గమనించారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశం సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన హృదయాన్ని తాకేలా ప్రసంగించారు.
“మీరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనే గర్వంగా చెప్పుకోగల స్థాయికి ఎదగాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు తక్కువ అంచనా వేయకండి” అని అన్నారు.
“రోజుకు ఒక్క గంట క్రమశిక్షణతో చదివినా, భవిష్యత్తు మారుతుంది. మీ విజయంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులు మాత్రమే, నిజమైన శ్రమ మీరు చేయాలి” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
“పరీక్షలు మీకు భయంకరమైనవి కావు, మీకు తెలిసిన విషయాలను చెప్పే అవకాశం మాత్రమే” అని ధైర్యం చెప్పారు.
కంప్యూటర్ ల్యాబ్ ప్రాముఖ్యతను వివరిస్తూ, “టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ విద్యార్థులకూ ప్రపంచం తెరవబడుతుంది” అని తెలిపారు.
“ప్రతి రోజు ఒక లక్ష్యంతో పాఠశాలకు రావాలి. ఆలస్యం, నిర్లక్ష్యం మీ శత్రువులు” అని హెచ్చరించారు.
ప్రత్యేక తరగతుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన డీఈఓ , విద్యార్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ ప్రసంగం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, చదువుపై కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఉపాధ్యాయులు తెలిపారు