చిత్తూరుజూలై3(ప్రజాన్యూస్):తిరుమలకొండల్లో దాదాపు రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది.అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటుచెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది.చెట్ల కింది పీహెచ్ 4.5 శాతానికి చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం కూడా ఎక్కువవుతోందని పరిశోధనలో గుర్తించింది బయోడైవర్సిటీ బోర్డు టిటిడి కి ఓ నివేదిక అందించడంతో ఈ విషయంపై టిటిడి ఆలోచనలో పడింది. అకేషియా చెట్ల వల్ల జంతువులకు కలుగుతున్న ఇబ్బందులు, జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని గ్రహించిన టిటిడి అధికారులు ఈ అంశాన్ని గత పాలక మండలిలో చర్చించారు.తిరుమల ఘాట్ రోడ్ల దగ్గర నుండి తిరుమల క్షేత్రం చుట్టూ దాదాపు రెండు వేల ఎకరాల్లో అకేషియా చెట్లు విస్తరించి ఉన్నాయి. వీటిని విడతలవారీగా పదేళ్లలోపు తొలగించాలని టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ చెట్లకు ప్రత్యామ్నాయంగా పురాణాల్లో విశేషంగా వర్ణించబడిన చెట్లను పెంచాలని నిర్ణయించారు. 15 నుంచి 20 రకాల మొక్కలను ఎంపిక చేసి అకేషియా చెట్లను తొలగించిన ప్రాంతాల్లో పెంచాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.